మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి వార్త, అబద్దం

రీసెంట్ గా భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (88) ఢిల్లీ ఎయిమ్స్‌ హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. జ్వరంతో బాధపడుతున్న మన్మోహన్‌ సింగ్‌ కు ఆరోగ్యం ఒక్క సారిగా క్షీణించింది. దీంతో ఆయన్ను దేశ రాజధాని ఢిల్లీ లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి లో కుటుంబ సభ్యులు చేర్పించారు. మన్మోహన్‌ సింగ్‌ కు ఎయిమ్స్‌ వైద్యులు ప్లూయిడ్స్‌ ఎక్కిస్తూ వైద్యం చేస్తున్నారు. అయితే అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది.  మన్మోహన్‌ సింగ్‌ చనిపోయారంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా వాట్సప్ లలో ఈ వార్త ఫార్వర్డ్ అవుతోంది. ఈ వార్తని కన్ఫర్మ్ చేసుకోకుండానే కొందరు రిప్ లు కూడా పెట్టేస్తున్నారు. ఆయన ప్రస్తుతం  కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన మృతి అంటూ వస్తున్న వార్తలన్నీ అబద్దం.

ఇక మన్మోహన్ సింగ్ కు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఇప్పటికే  వెల్లడించారు. ప్రస్తుతం ప్లేట్‌లెట్స్ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వివరించారు. కాగా, 89 ఏళ్ల మన్మోహన్ సింగ్‌కు సోమవారం జ్వరం రావడం, దాన్నుంచి కోలుకున్నప్పటికీ నీరసం తగ్గకపోవడంతో బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో సెంటర్ ప్రైవేటు వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ నితీశ్ నాయక్ నేతృత్వంలోని కార్డియాలజిస్టుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

 మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19 న కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయననను ఎయిమ్స్‌లో చేర్చారు. స్వల్పంగా జ్వరం వచ్చిన తర్వాత అతనికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆ తర్వాత మార్చి 4, ఏప్రిల్ 3 న రెండు మోతాదుల కరోనా వ్యాక్సిన్‌లను కూడా తీసుకున్నారు. 2009 లో మన్మోహన్ సింగ్‌ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. మన్మోహన్ ఆరోగ్య పరిస్థితి ఫై రాజకీయ నేతలు,  ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.